Monday, March 12, 2012

రక్త దానం

రక్త దానం (Blood donation) అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరం లో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర (cornea), చర్మం (skin), గుండె (heart), మూత్రపిండం (kidney), రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్చందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు. కనుక ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు.
ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషను చేసి ప్రాణం కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషనులో కూడ కొంత రక్త స్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో మొత్తం నష్టం పది, పన్నెండు యూనిట్లు (ఒక యూనిట్ = ఆర్ధ లీటరు) దాకా ఉండొచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం రక్తమే ఉరమరగా 12 యూనిట్లు ఉంటుంది. ఈ సందర్భంలో రోగి (patient) శరీరంలో ఉన్న పాత రక్తం అంతా పోయి కొత్త రక్తం ఎక్కించిన పరిస్థితి రావచ్చు. ఇటువంటి సందర్భంలో ఎన్నో కారణాల వల్ల దానం స్వీకరించినవాడి రక్తం సులభంగా గడ్డకట్టదు. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులు ఎదురయినప్పుడు రోగి స్వంత రక్తాన్నే ఎంత వీలయితే అంత గొట్టాల ద్వారా పట్టి, కూడగట్టి, శుద్ధి చేసి, తిరిగి వాడతారు. అలా చేయలేని పరిస్థితులలో ఇతరుల రక్తం అవసరం అవుతుంది. అవసరమైన వారి ప్రాణాలు కాపాడుతుంది.
అందుకే రక్త దానం ప్రాణ దానం అన్నారు.